Kamareddy Nagareswara Temple Swinging Dwajasthambam: గాలికి ఊగుతున్న ధ్వజస్తంభం… శివయ్య మహిమేనంటున్న భక్తులు
Kamareddy Nagareswara Temple Swinging Dwajasthambam: కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలోని నగరేశ్వర శివాలయంలో ఓ వింత చోటు చేసుకున్నది. ఆ వింతను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాని వస్తున్నారు. వచ్చిన వారు నగరేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని చేత్తో ఊపుతున్నారు. అలా ఊపినపుడు ఆ ధ్వజస్తంభం అటూ ఇటూ ఊగుతున్నది. దీంతో భక్తులు సంబ్రమాశ్చర్యాలను లోనవుతున్నారు. సాధారణంగా ఆలయంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఎంత బలంగా గాలి వీచినా కదలకుండా ఉండేలా ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ, నగరేశ్వర శివాలయంలోని ధ్వజస్తంభం అందుకు భిన్నంగా గాలి వీస్తే అటూ ఇటూ ఊగుతుంది.
ఎవరైనా సరే ధ్వజస్తంభాన్ని పట్టుకొని ఊపితే ఊగుతుంది. దీంతో నిత్యం పెద్ద సంఖ్యలో ఆ దేవాలయానికి చేరుకొని వింతను కనులారా వీక్షిస్తున్నారు. ఇదంతా నగరేశ్వర స్వామివారి మహత్యమని కొనియాడుతున్నారు. సుమారు ఈ ఆలయాన్ని నాలుగు శతాబ్దాల క్రిందట నిర్మించారు. ఆలయాన్ని నిర్మించిన సమయంలోనే ఈ ధ్వజస్తంభాన్ని కూడా నిర్మించినట్లు పూజారులు పేర్కొన్నారు. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన నగరేశ్వర ఆలయంలో ఈ వింత ఇటీవలే బయటపడిందని, అప్పటి నుండి భక్తుల రాక పెరిగిందని ఆలయ పూజారులు చెబుతున్నారు. అయితే, ఈ ధ్వజస్తంభం ఎందుకు అలా ఊగుతుందనే విషయాన్ని ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు.