Shamshabad Airport: కొత్త టెర్మినల్ ప్రారంభం…
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్‌ను అధికారులు ప్రారంభించారు. ఎయిర్‌పోర్టులో విస్తరణలో భాగంగా కొత్త అంతర్జాతీయ టెర్మినల్ ప్రారంభమైంది. ఈ కొత్త టెర్మినల్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో అద్భుతంగా అలంకరించారు. అంతర్జాతీయ విమానాలు ఈ నూతన టెర్మినల్ నుంచి నడవనున్నాయి. అంతర్జాతీయ హంగులతో రూపుదిద్దుకున్న అంతర్జాతీయ టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్ ఆకట్టుకుంటున్నాయి. 12 మిలియన్ ప్రయాణికుల లక్ష్యంతో 2005లో జీఎంఆర్ గ్రూప్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని చేపట్టింది. 2008లోనే ఈ నిర్మాణం పూర్తయింది. కాని, ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య మూడు రెట్లు పెరగడంతో దానికి తగ్గట్టుగా 35 మిలియన్ మంది ప్రయాణికుల సామర్థ్యంతో కొత్త టెర్మినల్‌ను ఏర్పాటుచేశారు. ఈ టెర్మినల్ నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రారంభమైంది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఒకే టెర్మినల్ నుంచి కొనసాగగా, ఇకపై అంతర్జాతీయ టెర్మినల్ నుంచి సేవలు ప్రారంభమౌతాయని అధికారులు పేర్కొన్నారు.