Shah and Nadda meeting with TS BJP Leaders: హడావుడి పిలుపు వెనుక ఆంతర్యం ఏంటి?
Amit Shah and Nadda meeting with Telangana BJP Leaders: తెలంగాణలో బీజేపీ కొంతమేర బలం పుంజుకున్న సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నప్పటికీ, ఆ తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోఅనుకున్నదాని కంటే అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకొని సత్తాను చాటుకుంది. అప్పటి నుండి బీజేపీ రాష్ట్రంలో బలపడటం మొదలుపెట్టింది. ఆ తరువాత జరిగిన దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ విజయం బీజేపీకి నైతికంగా మేలు చేసింది. అనంతరం, హుజురాబాద్ ఎన్నికల్లోనూ బీజేపీ భారీ విజయం సాధించింది. ఈ రెండు విజయాలు ఆ పార్టీకి మేలు చేశాయి.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనేని స్పష్టమైంది. ఆ తరువాత జరిగిన పరిణామాలు కూడా బీజేపీ బలం పెంచుకోవడానికే దోహదపడ్డాయి. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలమైన పవనాలు వ్యాపిస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తప్పకుండా విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర తెలంగాణలో ఆ పార్టీకి కొంతమేర బలం చేకూరింది. దీంతో పాటు, కేంద్ర అధిష్టానం నుండి కూడా తెలంగాణ బీజేపీకి సపోర్ట్ దొరుకుతుండటం కూడా శుభపరిణామమే. ఇక ఇదిలా ఉంటే, ఇటీవలే తెలంగాణలో బీజేపీ నేతలు కార్నర్ మీటింగులను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఈ కార్నర్ మీటింగులు పూర్తికాక ముందే కేంద్ర అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. కార్నర్ మీటింగులను పక్కన పెట్టి వెంటనే ఢిల్లీకి రావాలని ఆదేశించింది. కేంద్ర అధిష్టానం పిలుపు మేరకు బీజేపీ నేతలు హడావుడిగా ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని, నిర్లక్ష్యం చేయవద్దని షా నేతలకు సూచించారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పోటీ దారుగా బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారని, ఈ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పార్టీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ తీసుకురావాలని షా దిశానిర్దేశం చేశారు. బీజేపీకి సరైన అభ్యర్ధులు లేరని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని షా దిశానిర్ధేశం చేశారు. దుబ్బాక, హుజురాబాద్ విజయాలు అభ్యర్థుల చరిష్మా మేరకే వచ్చాయనే అపవాదును తొలగించేలా ప్రచారం నిర్వహించాలని షా నేతలకు సూచించారు. కేంద్ర అధిష్టానం ఆదేశం మేరకు తెలంగాణ బీజేపీ నేతలు కార్యాచరణను ప్రారంభించారు.