Deccan mall: ఈరోజు సాయంత్రం దక్కన్ మాల్ కూల్చివేత
Deccan mall: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగిన భవనం కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం దక్కన్ మాల్ కూల్చివేతకు సిద్ధమయ్యారు. 1890 చదరపు అడుగుల్లో ఉన్న డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవన నిర్మాణం కూల్చివేతకు రూ.33.86 లక్షలతో అధికారులు టెండర్లు పిలిచారు. కూల్చివేత ఎస్కే మల్లు ఏజెన్సీ ఈ టెండర్ ను దక్కించుకుంది. పక్కన ఉన్న భవనాలపై ఎలాంటి ప్రభావం పడకుండా తార్పలిన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. భారీ మెషీన్లు తీసుకొచ్చి డెబ్రిస్ తొలగింపు ప్రక్రియను చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలో 20 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రమాద ఘటనలో మృతి చెందిన ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. ఇక మరణించిన వాళ్ళ గురించి స్పష్టత వచ్చాకే భవనం కూల్చాలని భావించినా.. ఈ లోపే కూల్చక పోతే నష్టం వాటిల్లుతుందన్న నిపుణుల హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బాధిత కుటుంబీకులను ఒప్పించారు. ఇక కాసేపటి క్రితమే బిల్డింగ్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదంలో మరణించిన వారికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల నష్టారిహారం ప్రకించిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు సాయంత్రం నుండి ఆ మార్గాన్ని మూసివేయనున్నారు. అలాగే రెస్క్యూ టీం కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టింది.