Vande Bharat Train : నేటినుండి పరుగులు పెట్టనున్న వందే భారత్ రైలు
Vande Bharat Train : సికింద్రాబాద్ – వైజాగ్‌ను కనెక్ట్ చేసే ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఆదివారం సికింద్రాబాద్ స్టేషన్‌లో కూత పెట్టనుంది. ఈ రైలుతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం తగ్గనుంది. ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌గా పచ్చజెండా ఊపి వందే భారత్ ట్రైన్‌ను ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రేపటినుండి పూర్తి స్థాయిలో వందే భారత్ రైలు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.
ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. సికింద్రాబాద్‌లోని 10వ నంబర్ ప్లాట్ ఫాం నుంచి వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఇప్పటికే రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ కు వచ్చారు. కిషన్ రెడ్డితో కలిసి ఆయన రైలును పరిశీలించారు. అయితే ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కెసిఆర్ కు ఆహ్వానం పలికామని కిషన్ రెడ్డి తెలిపారు. మరి ఈ కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొంటారా ?లేదా మంత్రులను పంపుతాడా అనేది సస్పెన్స్ .
ఈ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయి.. అందులో 14 చైర్ కార్ బోగీలు, మరో రెండు ఎగ్జిక్యూటీవ్ చైర్‌కార్ బోగీలుంటాయన్నారు. మొత్తంగా రైలులో 1128 మంది ప్రయాణించవచ్చు. గంటకు 160 కి.మీ వేగంతో నడుస్తుంది. తొలి రోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 21 స్టేషన్లలో ఆగనుంది. సోమవారం ఉదయం 5.45 గంటలకు వైజాగ్‌లో ప్రారంభమై.. మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అదే రోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగనుంది.