G.H.M.C Annapurna Canteens: ఇక నుంచి కూర్చుని తినే సదుపాయం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ల రూపు రేఖలు మారనున్నాయి. ఇక నుంచి ఈ క్యాంటీన్లలో కూర్చొనే సదుపాయం కూడా కల్పించనున్నారు. దీని కోసమే నగరంలో 32 స్థలాలను ఎంపిక చేశారు. త్వరలోనే సీటింగ్ సదుపాయంతో కూడిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం అన్నపూర్ణ క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం లభిస్తోంది. భోజనం చేసే సమయంలో కూర్చునే అవకాశం లేకపోవడంతో అక్కనే నిలబడి తింటున్నారు. తినే సమయంలో కొంత మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గమనించిన అధికారులు సీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
2014లో తెలంగాణ ప్రభుత్వం అన్నపూర్ణ పథకం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 కోట్ల మందికి తక్కువ ధరకే భోజనాలు అందించింది. దీని కోసం ప్రభుత్వం దాదాపు 186 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రస్తుతం అన్నపూర్ణ పథకం నగరంలోని దాదాపు 150 కేంద్రాల్లో ఈ పథకం అమలు అవుతోంది. రోజుకు సుమారు 45 వేల మంది ఆకలి తీరుస్తున్నాయి. ఈ భోజనంలో 400 గ్రాముల రైస్, 120 గ్రాముల సాంబార్, 100 గ్రాముల కూర, 15 గ్రాముల పచ్చడిని అందిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో అన్నపూర్ణ క్యాంటీన్లు వచ్చిన వారందరికీ ఉచితంగా భోజనాలు అందించింది.