Preethi Suicide Case: సైఫ్ రిమాండ్ రిపోర్టులో వెలుగు చూసిన వాస్తవాలు
Saif remand report reveals so many secrets
మెడికల్ స్టూడెంట్ ప్రీతి కేసు విచారిస్తున్న పోలీసులు అనేక అంశాలను వెలికితీస్తున్నారు. నిందితుడు సైఫ్ ఫోన్లోని 17 వాట్సాప్ చాట్ లను పరిశీలించారు. అనుషా, భార్గవి, LDD+ knockouts వాట్స్ యాప్ గ్రూప్ చాట్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం సైఫ్ అనే డాక్టర్ అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతిని సూపర్ వైజ్ చేస్తున్నాడు.
రెండు ఘటనల ఆధారంగా ప్రీతిపై సైఫ్ కోపం పెంచుకున్నాడు. డిసెంబర్ నెలలో ఒక యాక్సిడెట్ కేసు విషయంలో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ రాసింది. ప్రీతి రాసిన రిపోర్టును వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసి హేళన చేశాడు. రిజర్వేషన్ కారణంగా ఫ్రీ సీట్ వచ్చిందంటూ ప్రీతిని అవమానించాడు.
తనతో ఏమైనా ప్రాబ్లమా అంటూ సైఫ్ ను ప్రీతి ప్రశ్నించింది. ఏమైనా సమస్య ఉంటే HOD కి చెప్పాలని సైఫ్ కు ప్రీతి వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనతో సైఫ్ ప్రీతిపై కోపం పెంచుకున్నాడు. ప్రీతిని వేధించాలని తన స్నేహితుడు భార్గవ్ అనే వ్యక్తిని కోరాడు. RICU లో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని తన స్నేహితుడు భార్గవ్ ను కోరాడు.
గత నెల 21 న HOD నాగార్జునకి ప్రీతి ఫిర్యాదు చేసింది. డాక్టర్లు మురళి, శ్రికల,ప్రియదర్శిని సమక్షంలో ప్రీతికి, సైఫ్ కు వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ జరిగిన కొద్ది గంటల్లోనే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది.