Revanth reddy: తలనరికే వరకు ఊరుకుంటామా..?
Revanth reddy sensational comments: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ గురువారం హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్బాగ్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాంతీయ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయం నుంచి సోనియా గాంధీ బయటకు వచ్చే వరకు నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పార్టీ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి లాంటి సోనియా గాంధీని ఈడీకి పిలిచి మోడీ అవమాన పరిచాడని అన్నారు. మన తల్లిని ఎవడైనా అవమానించే పని చేస్తే.. తలనరికే వరకు ఊరుకుంటామా..? అంటూ ఆయన కామెంట్ చేశారు. ఈడీ, సీబీఐలు మా పార్టీ నాయకుల ధైర్యాన్ని దెబ్బతీయలేవు మోడీ అంటూ ఆయన పేర్కొన్నారు. మోడీ కి రాక్షస ఆనందం ఉండొచ్చు కానీ అది దేశానికి మంచిది కాదని అన్నారు. ఏ దేశంలో మహిళలను అవమానిస్తే.. ఆ దేశంకి మంచిది కాదు అనేది గుర్తు పెట్టుకోవాలని అన్నారు.