Revanth Reddy : ఇక పంచాయితీల్లేవ్… వచ్చేది కాంగ్రెస్ సర్కారే
Revanth Reddy at Bijinepally Public Meeting: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గిరిజన దళిత ఆత్మగౌరవ సభను నాగర్ కర్నూలులోని బిజినేపల్లిలో భారీగా ఏర్పాటు చేసింది. ఈ సభలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు థాక్రే కూడా పాల్గొన్నారు. ఈ సభలో తెలంగాణ పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొడవలు, పంచాయితీలు సమసిపోయాయని అన్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోయిందని విమర్శించారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందని, ఆ పాలనకు చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో గిరిజనులు, దళితులు 30 శాతం మంది ఉన్నారని, వారంతా చేతులు కలిపితే బీఆర్ఎస్ పార్టీకి బొందపెట్టేస్తారని అన్నారు. ఫామ్ హౌస్ రాజకీయాల ఆటలు సాగబోవని, మరో ఎనిమిది నెలల కాలంలో ఎన్నికలు జరుగుతాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, ఎస్సీ, ఎస్టీలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. మాణిక్‌రావు ఠాక్రే వచ్చాక కాంగ్రెస్ పార్టీలో కలహాలు తొలగిపోయాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.