TS Govt Vs Rajbhavan: రాజ్‌భవన్ వేదికగానే రిపబ్లిక్ డే వేడుకలు…ఏం జరుగుతోంది
Republic Day Celebrations in Rajbhavan: రాజ్ భవన్ వేదికగా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించేందుకు రాజ్‌భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొంతకాలంగా తెలంగాణ గవర్నర్‌కు, సీఎంకు మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుండి రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు గవర్నర్‌ను ఆహ్వానించడం లేదు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వ శాసనసభా కార్యక్రమాలకు కూడా గవర్నర్‌ను ఆహ్వానించడం లేదు. గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటనల సమయంలోనూ ప్రోటోకాల్ ప్రకారం సీఎం పాల్గొనడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంత దూరం ఏర్పడిందో, రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య కూడా అంతేదూరం ఏర్పడింది.
రిపబ్లిక్ డే వేడుకలకు సమయం దగ్గర పడుతున్నా రాష్ట్రప్రభుత్వం ఇప్పటి వరకు ఈ వేడుకలకు సంబంధించిన ఎలాంటి వేదికను కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. అంతేకాకుండా, రాష్ట్రప్రభుత్వం తరపున ప్రసంగం చేయవలసిన కాపి కూడా ఇప్పటి వరకు రాజ్‌భవన్‌కు చేరలేదు. 2020, 21 సంవత్సరాల్లో రిపబ్లిక్ డే వేడుకలను పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించారు. కాగా, 2022లో రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది కూడా రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాజ్‌భవన్ నుండే గవర్నర్ సొంతంగా ప్రసంగించే అవకాశం ఉన్నది.