Indian Racing League: నేటి నుంచి సాగర తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ రౌండ్
Indian Racing League: ఫార్ములా రేసుకు మరోసారి హైదరాబాద్ ముస్తాబైంది. ఇండియన్ రేసింగ్ లీగ్ స్ట్రీట్ సర్క్యూట్ ఫైనల్స్ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. మూడు రౌండ్ల పాటు జరిగే తుది రేస్‌లో శనివారం ఒక రేసు జరుగనుంది. ఆదివారం చివరి రెండు రేసులు నిర్వహించనున్నారు. హుస్సేన్‌సాగర్ తీరంలో 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్ ఫార్ములా రేసు కోసం సిద్ధమైంది. నవంబర్ 20న హైదరాబాద్‌లో జరగాల్సిన తొలి రౌండ్ పోటీలు రద్దు కావటంతో.. ఫైనల్స్‌కు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా ఏర్పాట్లు చేశారు.
ముందంజలో బ్లాక్‌బర్డ్స్ చెన్నైలో జరిగిన రెండు అంచెల పోటీల అనంతరం హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ముందంజలో కొనసాగుతోంది. ఆరు రేసుల్లో ఏకంగా నాలుగింట అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌కు చేరువగా ఉంది. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ 206.5 పాయింట్లతో టాప్‌లో నిలువగా.. గాడ్‌స్పీడ్ కోచి 161.5 పాయింట్లుతో రెండో స్థానంలో నిలిచింది.
ఫైనల్ రౌండ్‌లో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగే నలుగురు డ్రైవర్ల బృందంలో అనిదిత్ రెడ్డి, లోఫెన్సా స్థానాల్లో విటాన్‌టొనియో లియుజి, గొసియా డెస్ట్ చేరారు. నేడు మధ్యాహ్నం 3.10 గంటలకు క్వాలిఫయింగ్ రేస్-1, 3.30 గంటలకు క్వాలిఫయింగ్ రేస్-2, నాలుగు గంటలకు తొలి స్ప్రింట్ రేస్-1 జరగనుంది. ఆదివారం 12.15 గంటలకు స్ప్రింట్ రేస్-2, మధ్యాహ్నం 3.30 గంటలకు రేస్-3 మొదలు కానుంది.