Margadarshi Case: మార్గదర్శి కేసులో రామోజీరావు, శైలజలకు వారం రోజుల పాటు ఊరట
Margadarshi Case: మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని రామోజీరావుతో పాటు మార్గదర్శి మేనేజింగ్ డైరక్టర్ శైలజా కిరణ్, అలాగే ఏపీలోని పలు బ్రాంచీల మేనేజర్లపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి మార్గదర్శి ఖాతాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్దంగా మళ్లింపు చేసినట్టు ఆరోపణలు ఉన్నందున సీఐడీ అధికారులు పలు బ్రాంచులలో రైడ్స్ చేసి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
మార్గదర్శి ఛిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ల నివాసాలపై కూడా ఏపీ సీఐడీ అధికారులు సోదాలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి. ఐపీసీ సెక్షన్ 120 (బీ), 409, 420, 477 (ఏ) , రెడ్ విత్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
అయితే ఈ కేసుల్లో తమపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని రామోజీరావు, మార్గదర్శి ఎండీ శైలజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించే అంశంలో తెలంగాణ హైకోర్టుకు పరిధి ఉందా? లేదా? తేలాలని ధర్మాసనం పేర్కొంది. వారం రోజుల పాటు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీంతో వారం రోజుల పాటు రామోజీరావు, శైలజపై చర్యలు తీసుకోబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు అండర్ టేకింగ్ ఇచ్చింది. ఇక ఈ కేసులో వారం రోజులపాటు వీరికి ఊరట లభించింది. ఇక ఈ నెల 20 వ తేదీన విచారణను చేపట్టనుంది కోర్ట్.