Raja Singh Released From Charlapally Jail: హైకోర్టు పీడీ యాక్ట్ ఎత్తివేయడంతో ఎట్టకేలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బుధవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. ముస్లిం ప్రవక్తను మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ వీడియోను విడుదల చేశారన్న ఆరోపణలపై తెలంగాణ పోలీసులు రాజా సింగ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయనపై పీడీ యాక్ట్ ను కూడా పోలీసులు ప్రయోగించారు. అనంతరం రాజా సింగ్ ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు…కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. దాదాపు 40 రోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉన్న రాజా సింగ్…జైలు నుంచి న్యాయ పోరాటం చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని, తనపై ప్రయోగించిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో ఆయన పిటిషన్ పై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు… బుధవారం సాయంత్రం పీడీ యాక్ట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక రాజా సింగ్ ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలు అధికారులు రాజా సింగ్ ను బుధవారం రాత్రి విడుదల చేశారు. హైకోర్టు షరతుల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీ లేకుండానే రాజా సింగ్ ఇంటికి వెళ్ళిపోయారు. రాజా సింగ్ రాక సందర్భంగా ఎమ్మెల్యే మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజాసింగ్ కి జై కొట్టిన అనుచరులు, మద్దతుదారులు, బీజేపి కార్యకర్తలు.. భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.