Raja Singh: అర్వింద్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి – రాజా సింగ్
Raja Singh finds falut with Dharmapuri Arvind
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. గులాబీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నుంచి కూడా బండి సంజయ్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. సంజయ్ వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అని అర్వింద్ తేల్చి పడేశారు. అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పార్టీలో ఉన్న లుకలుకలను బయటపెట్టాయని పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. బండి సంజయ్ వ్యక్తిగతంగా మాట్లాడలేదని.. పార్టీ అధ్యక్షుడు గానే మాట్లాడారని రాజాసింగ్ అన్నారు. అరవిందుకు ఏదైనా డౌట్ ఉంటే నేరుగా బండి సంజయ్ తో మాట్లాడవచ్చని అన్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం తప్పు అని రాజాసింగ్ అన్నారు. అరవింద్ తాను చేసిన వాక్యాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ తప్పు ఏమీ మాట్లాడలేదని రాజాసింగ్ వెనకేసుకు వచ్చారు. ఒకరి పై ఒకరు కామెంట్స్ చేసుకోవడం కరెక్ట్ కాదని రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.