Rain Effect: హైదరాబాద్ లో భారీగా పెరిగిన కూరగాయల ధరలు..!
Rain Effect Vegetables Price Hike: గత ఐదు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, పంట పొలాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో పొలాలు నీట మునిగాయి. కూరగాయల పంటలు సైతం నీట మునగడంతో నగరానికి వచ్చే కూరగాయలు తగ్గిపోయాయి. దీంతో కూరగాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి . హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, పక్క రాష్ట్రాల్లో సైతం వర్షాలు కురుస్తుండటంతో అక్కడి నుంచి కూడా దిగుమతులు తగ్గిపోయాయి.
నిన్నటి నుంచి కూరగాయల ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. డిమాండ్ కు తగిన విధంగా సరఫరా లేకపోవడంతో టమోటా ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం వరకు రిటైల్ మార్కెట్లో కిలో టమోటా ధర రూ 30 నుంచి రూ 40 వరకు ఉండగా, సోమవారం రోజున ఆ ధర రూ. 50 కి చేరింది. ఇక పచ్చిమిర్చి ధరలు సైతం అమాంతంగా పెరిగిపోయాయి. కిలో పచ్చిమిర్చి ధర రూ. 60 నుంచి రూ 80 కి పెరిగింది. ఇవే కాదు అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.