TSPSC: ప్రధాన సర్వర్ నుంచి పేపర్ కొట్టేసిన ప్రవీణ్, రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడి
Praveen stole the Exam paper from Main Server
TSPSC పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు వెలుగుచూశాయి. లీక్ వ్యవహారం బయటకు రావడంతో వెంటనే రంగంలో దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. పేపర్‌ను లీక్ చేసిన ప్రవీణ్ వ్యవహారంపై కీలక అంశాలు వెల్లడించారు. TSPSC కి వచ్చే చాలామందితో ప్రవీణ్ సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ సెల్‌ఫోన్లో చాలామంది మహిళల కాంటాక్ట్స్ ఉన్నట్లు కూడా పోలీసులు స్పష్టం చేశారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉన్న ప్రధాన సర్వర్ నుంచి ప్రవీణ్ పేపర్ కొట్టేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.లూప్‌లో ఉన్న కంప్యూటర్ల ద్వారా పేపర్ తీసుకున్న ప్రవీణ్, పేపర్ ప్రింట్ తీసి రేణుకకు షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.తమ కమ్యూనిటీలోని పలువురికి పేపర్ ఉందంటూ చెప్పిన రేణుక బేరాలకు తెరతీసింది. రేణుక భర్త, సోదరుడు కలిసి కమ్యూనిటీలో ప్రచారం చేసి పేపర్ అమ్మడానికి ప్రయత్నించారు.
ఒక్కో పేపర్‌కి రేణుక రూ. 20 లక్షలు డిమాండ్ చేసింది.పేపర్ కొనుగోలుకు ఇద్దరు అభ్యర్థులు ముందుకొచ్చారు. తన వద్ద పేపర్ కొన్న ఇద్దర్ని తమ ఇంట్లోనే ఉంచి రేణుక ప్రిపేర్ చేయించింది. పరీక్ష రోజున వనపర్తి నుంచి అభ్యర్థులను తీసుకొచ్చి..సరూర్‌నగర్‌లోని సెంటర్లో రేణుక వదిలిపెట్టింది.