Hyderabad: కాలుష్యం కోరల్లో హైదరాబాద్ నగరం, క్షీణించిన వాయు నాణ్యత
Pollution levels in Hyderabad are alarming
హైదరాబాద్ నగరంలో కాలుష్యం స్థాయి పెరిగిపోతోంది. వాయు నాణ్యత తగ్గిపోతోంది. సాధారణ వాయు కాలుష్యానికి తోడుగా నగరంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా కాలుష్యం మరింత పెరుగుతోంది. పారిశ్రామిక ప్రదేశాల నుంచి వచ్చే కాలుష్యం, వాహనాల నుంచి వచ్చే కాలుష్యం నగర వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వీటికి తోడు పొగమంచు కూడా జత కావడంతో కాలుష్యం కోరలు చాస్తోంది.
హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాలను పరిశీలిస్తే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్ధమౌతోంది. సాధారణంగా 50 నుంచి 100 మధ్యలో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరిధులు దాటుతోంది. 100 నుంచి 150 మధ్య నమోదౌతోంది. దీంతో పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లాంటి పరిస్థితే హైదరాబాద్ లో వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
పర్యావరణ ప్రణాళిక
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరుగుదలను గమనించిన ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు ప్రారంభించింది. కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ నగరాన్ని 540 గ్రిడ్స్ కింద విభజించింది. వాటిలో ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా కాలుష్యం వ్యాప్తి జరుగుతుందో గమనించి తదనుగుణంగా పర్యావరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ విధానం నుంచి ఫలితాలు రావడానికి ఇంకా కొంత సమయం పట్టేట్లు కనిపిస్తోంది.