Naveen Murder Case: నవీన్ హత్య కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్?
Naveen Murder Case: నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద నవీన్ ను హత్య చేసిన నిందితుడు హరిహరకృష్ణను ఎనిమిది రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ పై ఇవాళ కూడా వాదనలు సాగాయి. రేపు ఈ విషయమై రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. గత నెల 17వ తేదీన తన స్నేహితుడు నవీన్ ను అత్యంత దారుణంగా హరిహర కృష్ణ హత్య చేసి వారం రోజుల తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఇప్పటికే సుమారు 50కిపైగా సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణ ఎక్కడికి వెళ్లాడు, ఎవరెవరిని కలిశారు అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్య కేసు విషయమై హరిహర కృష్ణ నుండి సమాచారం సేకరించడంతో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉందని, అందుకే హరిహరకృష్ణను ఎనిమిది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఫోన్ డేటాను హరిహర కృష్ణ డిలీట్ చేసినట్లు గుర్తించిన పోలీసులు నవీన్ ఫోన్ ఇంకా లభ్యం కాని విషయాన్ని సైతం ప్రస్తావించారు. నవీన్ మొబైల్ ధ్వంసం చేసి చెట్ల పొదల్లో పడేశాడని తెలిపిన పోలీసులు ఈ విషయంలో హరిహర కృష్ణ నుంచి వివరాలు రాబట్టాలని చూస్తున్నారు.