Vande Bharat: వందేభారత్ – సంక్రాంతి స్పెషల్
Vande Bharat Express: దేశంలోని అత్యాధునిక అత్యంత వేగవంతమైన సెమీ హైస్పీడ్ ట్రైన్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఇండియన్ రైల్వేస్ నడుపుతోన్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్–వైజాగ్ నగరాల మధ్య ప్రారంభం కానున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో ప్రయాణ సమయం దాదాపు 43 శాతం తగ్గిపోనుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య తిరిగి గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రయాణ సమయం 14 గంటలు కాగా.. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రాకతో ఈ సమయం కేవలం 8 గంటలు మాత్రమే కానుంది.
ఈనెల 19 న ప్రధాని మోడీ చేతులమీదుగా ప్రారంభం కానున్న.. ఈ రైలు మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడడంతో నాలుగు రోజుల ముందుగా అంటే 15 వ తేదీ రోజున పట్టాలెక్కనుంది. 15వ తేదీన ఉదయం 10 గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభిస్తారు. రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని 8వ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా దాదాపు 8 గంటల్లో విశాఖపట్టణం చేరుకోనుంది
ఈ ట్రైన్ లో 16 కోచ్ లు ఉండగా.. అందులో 1128 సీటింగ్ సామర్థ్యం ఉండనుంది. 180 కి.మీ.ల వేగంతో పట్టాలపై పరుగులు పెట్టనున్న ఈ ట్రైన్.. 0–100 కి.మీ. వేగాన్ని కేవలం 52 సెకండ్లలో అందుకోనుంది. విశాఖపట్నం నుంచి ఉదయం 5.45కు బయలుదేరే రైలు రాజమండ్రికి 8.08కు చేరుతుంది. రెండు నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయల్దేరి ఉదయం 9.50కు విజయవాడ చేరుతుంది. 9.55కు విజయవాడలో బయల్దేరి మధ్యాహ్నం 12.05కు వరంగల్ చేరుతుంది. మధ్యాహ్నం 2.25కు సికింద్రాబాద్ చేరుతుంది. మరోవైపు ఖమ్మంలో కూడా వందే భారత్ రైలుకు హాల్ట్ కల్పించారు. ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,850 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ ధర రూ.3,400గా ఉందని సమాచారం.