TSPSC: పెద్దోళ్లకు తెలియకుండా ఈ ఇద్దరే అంతా చేసారా – రేవంత్ రెడ్డి
PCC Revanth reddy questions CM KCR on Paper Leak issue
పోటీ పరీక్షా పేపర్ల లీకేజీ విషయంలో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలు ఘాటు విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని బలంగా టార్గెట్ చేస్తున్నారు. తాజా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరును తప్పు బట్టారు. లీకేజీ వ్యవహారంపై పలు ప్రశ్నలు సంధించారు. సీఎం రివ్యూలో విచారణ అధికారులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
సిట్ అధికారులను రివ్యూ మీటింగ్ కు ఎందుకు పిలవలేదని నిలదీశారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి ఉంటే కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇద్దరే నేరం చేసారని కేటీఆర్ ఎలా చెబుతారని అనుమానం వ్యక్తం చేశారు. కమిషన్ కు బాధ్యత లేకుండా కింది సిబ్బందిని ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. పెద్దోళ్లకు తెలియకుండా ఈ ఇద్దరే అంతా చేసారా అంటూ నిలదీశారు. కేసులో పెద్ద తలకాయలను కాపాడుకోవటానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసామని రేవంత్ రెడ్డి తెలిపారు.
TSPSC పేపర్ లీక్ పై రేపు ఎల్లారెడ్డిలో రేవంత్ దీక్ష
పేపర్ లీకుల వ్యవహారానికి నిరసనగా రేవంత్ రెడ్డి రేపు ఎల్లారెడ్డిలో దీక్ష చేయనున్నారు. దీక్షతో పాటు రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయండని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పేపర్ లీక్ వ్యవహారంపై 22న కాంగ్రెస్ ముఖ్య నేతలమంతా గవర్నర్ ను కలుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.