Revanth Reddy: సోమేశ్ కుమార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ, రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
PCC Chief Revanth reddy reaction on Somesh Kumar issue
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. సోమేశ్ కుమార్ నియామకం అక్రమమని మొదటి నుంచి తాను చెబుతున్నామని, ఇప్పుడు హైకోర్టు అదే చెప్పిందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ధరణి, సీసీఎల్ఏ, రెరాకు హెడ్‌గా సోమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం సోమేశ్ కుమార్‌ను ఏపీకి కేటాయించింది. సోమేశ్ కుమార్ CAT ని ఆశ్రయించారు. తెలంగాణలో కొనసాగేలా చూడాలని కోరారు. దీంతో పూర్వాపరాలను పరిశీలించిన CAT కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసింది. తెలంగాణలో కొనసాగేందుకు వీలుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సవాలు చేసింది. హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017లో కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగే విషయమై కేసీఆర్ సర్కార్ ఎటువంటి అడుగులు వేయనుందనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.