ORR Greenary: పచ్చదనంతో కట్టిపడేస్తున్న ఓఆర్ఆర్ పరిసరాలు
ORR Greenary is attracting the People of Hyderabad
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్ అయింది. ఆ రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా పచ్చదనమే దర్శనమిస్తోంది. పచ్చని మొక్కలు, పూలు, వరుసగా విద్యుత్ దీపాల వెలుగులు నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో శని, ఆదివారాలలో నగర వాసులు ఆయా ప్రాంతాలకు తరలివస్తున్నారు. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
రహదారులకు ఇరువైపులా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ జాతుల మొక్కలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటువైపులా వెళుతున్న ప్రయాణికులు పరవశం చెందుతున్నారు. పుష్పాల సోయగాలతో మంత్ర ముగ్దులు అవుతున్నారు.
పటాన్ చెరు ప్రాంతం నుంచి గచ్చిబౌలికి వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక మొక్కలు టెకోమా, కరేబియన్ ట్రపెంట్ ట్రీ, బంగారు రంగు చెట్లు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. సాధారణంగా ఎక్కడా కనిపించని ఆ మొక్కలు నగరవాసులను పరవశానికి గురిచేస్తున్నాయి.