Tsrtc: ఆర్టీసీకి 550 విద్యుత్తు బస్సులు
Tsrtc: టీఎస్ఆర్టీసీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను టీఎస్ఆర్టీసీకి సరఫరా చేయనుంది. ఎయిర్ కండీషన్డ్ ఇంటర్సిటీ కోచ్ ఎలక్ట్రిక్ బస్సులు మహానగరాలైన హైదరాబాద్, విజయవాడ మధ్య తిరుగుతాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈసందర్భంగా టీఎస్ఆర్టీసీ సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తాము మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించామన్నారు.
వీసీ.సజ్జనార్ మాట్లాడుతూ.. మార్చి 2025 నాటికి హైదరాబాద్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోందన్నారు. మొదటిదశలో 550 ఈ-బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ నుంచి 550 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ వచ్చిందన్నారు. వీటిలో స్టాండర్డ్ ఫ్లోర్ 12 మీటర్లున్న.. 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ కోచ్ ఈ-బస్సులున్నాయన్నారు. ధ్వని, వాయు కాలుష్యాన్నితగ్గించి ప్రయాణికులకు స్వచ్ఛమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించనున్నాయని పేర్కొన్నారు.