EC On RVS: రిమోట్ ఓటింగ్‌పై ప్రతిపక్షాలు అభ్యంతరం
EC on Remote Voting System: కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ సరళిని మరింత సులభతరం చేసేందుకు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రిమోట్ ఓటింగ్ పద్ధతిని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ విధానంపై ఢిల్లీలో అన్ని పార్టీలకు డెమోను ప్రదర్శించింది. ఈ డెమో విధానం అనంతరం ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను ఈనెల 30వ తేదీ లోగా తెలియజేయాలని ఈసీ కోరింది. కాగా, ఈ మిషిన్‌పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం రిమోట్ ఓటింగ్ విధానం అవసరం లేదని, అభివృద్ధి సాధించిన దేశాల్లో కూడా రిమోట్ ఓటింగ్ వ్యవస్థలను పక్కనపెట్టాయని, రిమోట్ వ్యవస్థద్వారా ఓటు వేయవలసిన ఓటరే తన ఓటును వేస్తున్నాడని నిర్ధారించడం కష్టం అవుతుందని, ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న ఈవీఎం మిషిన్ల విషయంలోనే పలు అనుమానాలు ఉన్నాయని, కొత్తగా రిమోట్ ఓటింగ్ మిషిన్‌ను తీసుకురావడం వలన ఆ అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంటుందని తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
పార్టీ నేతలతో చర్చించి ఈనెల 30 వ తేదీ లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. రిమోట్ ఓటింగ్ సిస్థం ద్వారా వివిధ ప్రాంతాల్లో నివశించే ఓటర్లు సొంత ప్రాంతాలకు వెళ్లకుండానే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేసిన ఈ రిమోట్ ఓటింగ్ మిషిన్ ద్వారా 72 నియోజకవర్గాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఈ విధానం అమలులోకి తీసుకురావడం ద్వారా ఓటర్లు ఎన్నికల సమయంలో సొంత ప్రాంతాలకు వెళ్లవలసి అవసరం ఉండదని, తద్వారా ఖర్చులు ఆదా కావడమే కాకుండా, సొంతగ్రామాలకు వెళ్లలేనివారు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కలుగుతుందని ఈసీ చెబుతున్నది.