Odisha Ex CM to join in BRS: బీఆర్ఎస్‌లోకి బీజేపీ ఒడిశా మాజీ సీఎం
Odisha Ex CM to join in BRS: ఒడిశాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే ఆయన, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ లోక్‌సభకు 9 సార్లు ఎంపికయ్యారు. 2015 వరకు కాంగ్రెస్ పార్టలో ఉన్న గమాంగ్, ఆ ఏడాది ఆ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుండి ఏడేళ్లపాటు బీజేపీలో కొనసాగారు.
కాగా, ఇప్పుడు గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్‌లు బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. త్వరలోనే వీరు భారత రాష్ట్రసమితిలో చేరబోతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు కూడా ప్రకటించాయి. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా పేరు మార్చి దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పార్టీ అధ్యక్షుడిని నియమించారు. వచ్చే నెల 5 వ తేదీన మహారాష్ట్రలోని నాందేడ్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభద్వారా కొంతమంది మహానేతలను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. వీరితో పాటే ఒడిశా నేతలు చేరతారా లేదంటే, ఒడిశాలో మరో సభను ఏర్పాటు చేసినపుడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారా అన్నది తెలియాల్సి ఉన్నది.