Hyderabad: పల్లెలో పట్నం వాసులు..బోసిపోయిన నగరం
Hyderabad: సంక్రాంతి పండుగను సొంత గ్రామాల్లో నిర్వహించుకునేందుకు నగర ప్రజలు పట్నాన్ని వీడి పల్లెలకు తరలివెళ్లారు. వ్యాపారవేత్తల దగ్గరనుండి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, చిన్నాచితక పనులు చేసుకొని పనిచేసే ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఊర్లకు వెళ్లారు. మహా నగరానికి చెందిన తెలంగాణ వాసులు సైతం ఏపీలోని వివిధ ప్రాంతాల్లో జరిగే సంక్రాంతి వేడుకలను వీక్షించేందుకు వెళ్లారు. జన సందోహంగా ఉండే భాగ్యనగరం బోసి పోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ప్రజలు అధికంగా నివసించే మియాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, వంటి ప్రాంతాలతో పాటు పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్, కోఠి, మలక్‌పేట్ వంటి ప్రాంతాలలో జన సంచారం భారీగా తగ్గింది.
తెల్లవారినుండి అర్ధరాత్రి వరకు రణగొన ధ్వనులతో నిత్యంచెవుల్లో చిల్లులు పడేలా హారన్ మోతలు.. సందులేకుండా ఉండే నగర రహదారులు నిర్మానుష్యంగా మారాయి. క్షణం తీరికలేకుండా వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో పనిచేసే ట్రాఫిక్ సిబ్బందికి రెండు రోజులు ఉపశమనం లభించింది. నగరం లోని రోడ్లన్నీ నిర్మానుష్యం గా మారడంతో నగర వాసులు హైదరాబాద్లోనే ఉన్నామా అని ఆశ్చ్యర్య పోతున్నారు.
సంక్రాంతి వేడుకలను సొంత ఊర్లలో నిర్వహించుకునేందుకు వెళ్లేవారి గృహాలను టార్గెట్ చేసి భారీగా చోరీలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. సంక్రాంతి పండుగ కోసం వేచిఉన్న దొంగలు చెలరేగి పోతారు. గతంలో జంట నగరాల పరిధిలో ఈ తరహా దొంగతనాల్లో భారీగా నగదు, ఆభరణాలు అపహరణకు గురి అయ్యాయి. ఇలా చోరీకి గురైన అనేక కేసులు ఇప్పటికీ దర్యాప్తు సాగుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న పోలీస్ ఉన్నతాధికారులు పోలీస్‌స్టేషన్ల వారీగా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పండుగకు వెళ్లేవారు స్థానిక పోలీస్‌స్టేషన్లలో సమాచారం అందించాలని ప్రచారం నిర్వహించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాల ద్వారా పగలు, రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.