Hyderabad Alerts: హైదరాబాద్‌లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. 11 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం
Cold Wave In Hyderabad: తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు అవుతున్నాయి. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 6 నుంచి 11 వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో కనిష్టంగా 7 -9 సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని.. మిగిలిన ప్రాంతాల్లో అత్యల్పంగా 11-15డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక హైదరాబాద్‌లో క్రమంగా చలి పెరుగుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. సాయంత్రం 5 దాటితే చాలు .. చలి వణికిస్తోంది. తెలంగాణలోని.. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్‌లో ఎక్కువగా చలి గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్ లో గత 24 గంటల్లో కనిష్టంగా 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే నాలుగు రోజులు చలి తీవ్రంగా మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.