Inter Linking of Rivers: గోదావరి కావేరి అనుసంధానం… జాతీయ అథారిటీ ఏర్పాటు
Inter Linking of Rivers: దేశంలోని ప్రముఖ నదులను అనుసంధానం చేయడం ద్వారా మిగులు జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోవడాన్ని కొంతమేర అడ్డుకట్ట వేయవచ్చని కేంద్రం భావించింది. చాలా కాలంగా నదులను అనుసంధానం చేయడం ద్వారా అన్ని ప్రాంతాలకు నీటిని సరఫరా చేయవచ్చని, ఏ ప్రాంతంలో కూడా పంటలు, త్రాగునీటికి సమస్య ఉండబోదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కాగా, ఇందులో భాగంగా ఇప్పుడు గోదావరి-కావేరీ నదుల అనుసంధానం తెరపైకి వచ్చింది. దీని కోసం ప్రత్యేకంగా జాతీయ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ హైవే అథారిటీ మాదిరిగానే నదుల అనుసంధానం కోసం ఓ జాతీయ అథారిటీ ఏర్పాటు కానున్నది. దీనికోసం ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల జలవనరుల ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గోదావరి కావేరి నదుల అనుసంధానంతో తెలంగాణ, ఏపీకి లాభం చేకూరుతుందని, రాష్ట్రాల అనుమతులు తీసుకున్నాకే అనుసంధానం మొదలౌతుందని టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరే శ్రీరాం వెల్లడించారు. అయితే, తమ డీపీఆర్‌లకు అనుమతి ఇచ్చాకే అనుసంధానం మొదలుపెట్టాలని తెలంగాణ పేర్కొనగా, పోలవరం నుండే గోదావరి కావేరీ నదుల అనుసంధానం మొదలుపెట్టాలని ఏపీ పేర్కొన్నది. అయితే, పోలవరం నుండి నదుల అనుసంధానం మొదలుపెట్టడం సాధ్యం కాదని అన్నారు. ఈ అనుసంధానం కోసం కేంద్రం 90 శాతం నిధులను కేటాయిస్తుందని, రాష్ట్రాల వాటా కేవలం 10 శాతం మాత్రమే ఉంటుందని అన్నారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం కోసం రూ. 43 వేల కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు టాస్క్‌ఫోర్స్ చైర్మన్ పేర్కొన్నారు.