Hyderabad: నో కార్డ్..ఓన్లీ క్యాష్ అన్నందుకు చంపేశారు
Hyderabad: రంగారెడ్డి జిల్లా నార్సింగీలో దారుణం చోటు చేసుకుంది. పెట్రోల్ పంప్‌లో పని చేసే కార్మికుడిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన ఆ కార్మికుడు మృతి చెందాడు. రాత్రి 12 గంటల సమయంలో జన్వాడలోని హెచ్ పి పెట్రోల్ బంక్ వద్దకు పెట్రోల్ కోసం ముగ్గురు యవకులు కారులో వచ్చారు. బంక్ క్లోజచేశామని చెప్పిన చాలాదూరం వెళ్లాలని బతిమిలాడడంతో వారి కారులో పెట్రోల్ పోశారు.
ఆతరువాత వారు కార్డు ఇచ్చారు. అయితే.. స్వైప్ మిషన్ పని చేయడం లేదని, క్యాష్ ఇవ్వమని అడిగాడు. మాకే ఎదురు మాట్లాడుతారా అంటూ కారులోని ముగ్గురు యువకులు క్యాషియర్ చోటు పై దాడి చేశారు. చోటును కొట్టవద్దు అంటూ సంజయ్ అడ్డుకున్నాడు. అడ్డువచ్చిన సంజయ్ పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో సంజయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బంకులో ఏర్పాటు చేసి ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు.. ముగ్గురు యువకులపై కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.