MP Avinash Petition: అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వండి
MP Avinash Reddy Writ Petition in High Court: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయగా, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ఇప్పటికే ఒకసారి విచారించింది. కాగా, మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. సీబీఐ అధికారులు సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇవ్వడంతో అవినాశ్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కారు. తనను అరెస్ట్ చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని పిటిషన్‌లో అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు.
నేడు అవినాశ్ రెడ్డి సీబీఐ ముందు హాజరుకానున్నారు. అవినాశ్ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్‌పై విచారణ జరగాల్సి ఉన్నది. ఈ కేసులో ఏ 4 గా ఉన్న దస్తగిరిని ఇప్పటి వరకు సీబీఐ అరెస్ట్ చేయలేదని, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ వ్యతిరేకించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, కానీ, తనను ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అవినాశ్ రెడ్డి రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.