MLC Kavitha Petition in Supreme Court: మరోసారి సుప్రీంకోర్టుకు కవిత
MLC Kavitha Petition in Supreme Court: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను మార్చి 11వ తేదీన ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కవితను విచారించారు. కాగా, మార్చి 16వ తేదీన మరోసారి విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాను మార్చి 16 వ తేదీన హాజరుకాలేదని ఈడీకి మెయిల్ చేశారు. అదే సమయంలో ఈడీ విచారణ నుండి తనకు స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కాగా, కవిత పిటిషన్‌పై విచారణను ఈనెల 24 వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, మార్చి 20 వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరోసారి కవిత సుప్రీంకోర్టు తలుపులు తట్టనున్నారు. నేడు మరోసారి సుప్రీంకోర్టులో విచారణపై ప్రత్యేక ప్రస్తావన చేయనున్నారు. మార్చి 20వ తేదీలోగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.
ఇక ఇదిలా ఉంటే, మనీష్ సిసోడియా ఈడీ కస్టడీ నేటితో ముగియనున్నది. మనీష్ సిసోడియాను ఈడీ వారం రోజులు పాటు విచారించింది. నేడు రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టులో సిసోడియాను హాజరుపరచనున్నారు. అంతేకాకుండా ఈరోజు గోరంట్ల బుచ్చిబాబును, రామచంద్ర పిళ్లైను కలిపి ఈడీ విచారించనున్నది. రామచంద్ర పిళ్లై ఇచ్చిన వివరాల ఆధారంగానే గతంలో ఈడీ కవితను విచారించింది. అయితే, పిళ్లై తన వాగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాగా, నేడు ఆయన్ను మరోసారి విచారిస్తుండటంతో ఈ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయో చూడాలి.