MLC Kavitha Dharna in Delhi: నేడు ఢిల్లీలో కవిత ధర్నా… 16 పార్టీల మద్ధతు
MLC Kavitha Dharna in Delhi: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు కోరుతూ ఈరోజు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో దీక్ష చేయబోతున్నారు. జంతర్ మంతర్ వద్ద ఈ దీక్షను చేపట్టనున్నారు. ఈ దీక్షకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే అనేక పార్టీల నాయకులతో ఆమె సంప్రదింపులు జరిపారు. కవిత చేపడుతున్న దీక్షకు 16 పార్టీల మద్దతు ఉందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ దీక్షను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ప్రారంభించనున్నారు. కవిత చేపడుతున్న దీక్షకు వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీ మరో దీక్షను చేపట్టబోతున్నారు. లిక్కర్ స్కామ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీ ధర్నాను చేపడుతున్నది. ఈ దీక్షకు భారీ సంఖ్యలో నేతలు హాజరుకానున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి రావడంతో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఆమె ఈడీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉన్నా, ముందుగా ధర్నా నిర్ణయం కావడంతో రేపు ఈడీ అధికారుల ముందు హాజరుకానున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు విచారించిన సమయంలో ఆయన ఇచ్చిన కీలక వాగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు. ఈ లిక్కర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26వ తేదీన సీబీఐ అరెస్ట్ చేయగా, మార్చి 9 వ తేదీన ఈడీ అధికారులు మరోసారి అరెస్ట్ చేశారు.