Talasani: హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు ఎప్పుడు వచ్చాయో కిషన్ రెడ్డికి తెలియదా ?
Minister Talasani Srinivas yadav fires on Kishan reddy
రాంగోపాల్ పేట ఫైర్ యాక్సిడెంట్ విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఇది చాలా పెద్ద అగ్నిప్రమాదమని ఇటువంటి ప్రమాదం ఇటీవల కాలంలో చూడలేదని మంత్రి అన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగిన ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొన్నాయని తెలిపారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు.
ప్రమాదం జరిగిన బిల్డింగ్ పై కొద్ది గంటల్లో రిపోర్ట్ వస్తుందని ఆ తర్వాతనే అన్ని విషయాలపైనా స్పస్టత వస్తుందని మంత్రి అన్నారు. నగరంలో ఇటువంటి బిల్డింగులు 25 వేల వరకు ఉంటాయని ఒక అంచనా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 25 న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని, పాత బిల్డింగులు, ఫైర్ సేఫ్టీ విషయాలపై సమీక్ష చేపడతామని తెలిపారు.
ప్రమాద విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తలసాని ఖండించారు. కిషన్ రెడ్డి ఒక గాలి మంత్రి, గాలి మాటలు మాట్లాడారని తలసాని మండిపడ్డారు. హైదరాబాద్ కు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కానీ కిషన్ రెడ్డీ అర్థం లేకుండా మాటలు మాట్లాడుతున్నారని తలసాని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు ఎప్పుడు వచ్చాయో తెలియదా ? అని తలసాని ప్రశ్నించారు.