అక్రమ మద్యం రవాణా విషయంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తం అయింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న మద్యంపై నిఘా ఉంచింది. మద్యం మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని విధాలా చర్యలు చేపడుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో తాజాగా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న విషయమై ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు
Minister Srinivas Goud warning to liquor Mafia
అక్రమ మద్యం రవాణా విషయంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తం అయింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న మద్యంపై నిఘా ఉంచింది. మద్యం మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని విధాలా చర్యలు చేపడుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో తాజాగా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న విషయమై ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మద్యం తీసుకు రావడం నేరమని అన్నారు.
1130 ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిల్స్ ఎయిర్ పోర్టులో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హర్యానా, గోవా నుంచి మద్యం సరఫరా చేస్తున్నారని… ఇది మాఫియాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తయారయ్యే మద్యం మాత్రమే ఇక్కడ ఉపయోగించాలని సూచించారు.
ఇతర ప్రాంతాల మద్యం ఇక్కడ ఉపయోగిస్తే ఆర్థికంగా నష్టం వాటిల్లుతుదని, తాగే వారి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు. మద్యం అక్రమ రవాణా సరైంది కాదని మంత్రి అన్నారు. తెలంగాణ డిపోల్లో తయారైయ్యే మద్యం వినియోగించుకోవాలని సూచించారు. ఫంక్షన్స్ లో మద్యం వినియోగించుకోవడానికి అనుమతులు సులభతరం చేసామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారు 2 బాటిల్స్ తెచ్చు కోవచ్చని గుర్తుచేశారు.
మద్యం మాఫియా పై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఎయిర్ పోర్టు వరకు మాత్రమే ఎయిర్ పోర్టు అథారిటీకి అధికారం ఉంటుందని, రాష్ట్రంలో మద్యం విక్రయానికి ఎయిర్ పోర్టు అథారిటీకి సంబంధం ఉండదని మంత్రి గుర్తుచేశారు. గతంలో ప్రభుత్వానికి రావాల్సిన ఖజానా రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్ళేవని మంత్రి విమర్శలు గుప్పించారు. ఏపీలో, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో గంజాయి సాగు చేసి తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని ఈ ముఠాలపై కూడా ఉక్కుపాదం మోపుతామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.