Minister Ktr: నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న.. మంత్రి కేటీఆర్
Minister Ktr: రోజు రోజుకి హైదరాబాద్ నగరం విస్తరిస్తూనే అభివృద్ధికి నోచుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ. 54.71 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను నేడు మంత్రి కేటీఆర్ అందుబాటులోకి తీసుకురానున్నారు. జీహెచ్‌ఎంసీ ద్వారా రూ. 8 కోట్ల విలువైన 2 పనులు, హెచ్‌ఎండీఏ ద్వారా రూ.16.25 కోట్ల విలువ గల సర్వమత శ్మశాన వాటికలు, మరో 2 కోట్లతో వనస్థలిపురం వద్ద నిర్మించిన స్విమ్మింగ్‌ఫూల్, హెచ్‌ఆర్‌డీసీఎల్ ఆధ్వర్యంలో రూ. 25.60 కోట్లతో పూర్తి చేసుకున్న పీర్జాదిగూడ లింకు రోడ్డును నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఉదయం 10 గంటలకు బండ్లగూడ లోని లోతట్టు ప్రాంత వరద నివారణకు జీహెచ్‌ఎంసీ అమలు చేస్తున్న ఎస్‌ఎన్‌డీపీ ద్వారా నగరంలో రూ. 724 కోట్ల అంచనా వ్యయంతో పనులను చేపట్టారు. ఎల్బీనగర్ జోన్‌లో ఎస్‌ఎన్‌డీపీ ద్వారా నాలా అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో బండ్ల గూడ చెరువు నుంచి నాగోల్ వరకు రూ. 7.26 కోట్ల వ్యయంతో చేపట్టిన బాక్స్ డ్రైన్ పూర్తి కావడంతో అనేక కాలనీలకు ముంపు సమస్య లేకుండా పోతుంది. దీనిని మంత్రి కేటీఆర్ నేడు అక్కడి ప్రజలకు అంకితం చేయనున్నారు.
అలాగే జంతు సంరక్షణ కేంద్రంలో పెంపుడు జంతువుల శ్మశానవాటికను పీపుల్ ఫర్ యానిమల్స్ స్వచ్ఛంద సంస్థతో కలిసి జీహెచ్‌ఎంపీ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన పీఎఫ్‌ఏ సంస్థ పెంపుడు జంతువుల శ్మశాన వాటిక తన స్వంత ఖర్చులతో ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీనిని నేడు మంత్రి ప్రారంభించనున్నారు. అలాగే 11 గంటలకు గ్రేవ్ యార్డ్ ప్రారంభించిన తరువాత ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడనున్నారు. మధ్యాహం 12.30 గంటలకు వనస్థలీపురంలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ను మంత్రికేటీఆర్ ప్రారంభించనున్నారు.