Minister Errabelli on KTR: రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్
Minister Errabelli on KTR: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని అన్నారు. కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడని, కేటీఆర్ వలనే రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. కేటీఆర్ భవిష్యత్తు నాయకుడని, ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించడం ఖాయమని తెలిపారు. కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని మంత్రులు మరోమారు పాటపాడటంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
గతంలో ఒకమారు ఇదేవిధంగా మంత్రులు వ్యాఖ్యలు చేయడంతో కేటీఆర్ కలుగజేసుకొని తమ నాయకుడు కేసీఆర్ అని, ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే తామంతా ముందుకు సాగుతామని చెప్పారు. కాగా, మరోమారు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని ఎర్రబెల్లి వంటి మంత్రులు చెప్పడంతో కేటీఆర్ మళ్లీ వివరణ ఇచ్చుకోవలసి రావొచ్చు. గతంలో ఇలాంటి ప్రచారం జరిగిన సమయంలో కేసీఆర్ కూడా స్పందించారు. ఈ రకమైన ప్రచారం వద్దని స్పష్టం చేశారు. ఈ ఏడాది జరిగే ఎన్నికలకు సిద్దమౌతున్న వేళ మరోసారి ఇలాంటి ప్రచారం మొదలుకావడంతో బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.