Hyderabad Metro: మొరాయించిన హైదరాబాద్ మెట్రో!
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ఏ ముహూర్తాన మొదలయిందో కానీ ఎప్పటికప్పుడు అనేక సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడడం షరా మామూలు అయింది. తాజాగా మెట్రో సర్వీసులో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది, ఈరోజు అమీర్‌పేట-రాయదుర్గం మార్గంలో వెళ్తున్న రైలులో సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. ఆ సమస్య కారణంగా రైలు అరగంట పాటు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగాల్సి రావడంతో మెట్రో సర్వీసుల రాక పోకల్లో తీవ్ర ఆలస్యం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ కారణంగానే అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నిజానికి సోమవారం కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకోగా . సాంకేతిక సమస్యల కారణంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే మార్గంలో వెళ్తున్న ఓ రైలును ఎర్రమంజిల్ స్టేషన్‌లో నిలిపివేశారు. అలా నిలిపివేయడంతో ఆ మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్ల రాకపోకలకు ప్రభావం పడింది. ఈ దెబ్బకు అన్ని మెట్రో రైలు సర్వీసులు ఆలస్యంగా కొనసాగాయి. ఇదే విషయమై ప్రయాణికులు సోషల్‌మీడియాలో అసంతృప్తిని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే.. సాంకేతిక సమస్యను సరిదిద్దిన తర్వాత వెంటనే మెట్రో రైలు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి కానీ మారో సారి హైదరాబాద్ మెట్రో డొల్లతనం బయట పడినట్టు అయింది.