Hyderabad Mtero: మెట్రో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
Hyderabad Mtero: హైదరాబాద్ నగరంలోని మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్య ఉదంతం చోటు చేసుకుంది. మెట్రో ట్రైన్ కింద దూకి గుర్తు తెలియని వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నా సరే.. మెట్రో స్టేషన్లు ఆత్మహత్యకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా మెట్రో స్టేషన్ లలో ఆత్మహత్య ఘటనలు వెలుగు చూశాయి. భరత్‌నగర్ మెట్రో స్టేషన్ రెయిలింగ్‌పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. తాజాగా మూసాపేట్ మెట్రో స్టేషన్ లో మెట్రో రైలుకి ఎదురుగా దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం షాక్ కి గురి చేసింది.
గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టికెట్ తీసుకోకుండానే ఆ వ్యక్తి స్టేషన్‌లోకి ప్రవేశించినట్లు సిబ్బంది చెబుతున్నారు. నేరుగా ప్లాట్‌ఫామ్‌కు చేరుకుని.. సరిగ్గా రైలు వచ్చేది గమనించి దానికి ఎదురుగా దూకేశాడు. ఈ క్రమంలో ఇంజిన్‌కు ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో బాడీ పడిపోయింది. అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కానీ దారిలోనే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనపై కేసు నమో దు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని అతని వయస్సు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు.