ఉగ్రవాద శిక్షణలో భాగంగా మొత్తం 17 మంది భోపాల్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత వీరిలో ఆరుగురు హైదరాబాద్‌లోనే ఉంటూ వికారాబాద్ అటవీ ప్రాంతంలో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.
Hyderabad Terror: ఉగ్రవాద శిక్షణలో భాగంగా మొత్తం 17 మంది భోపాల్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత వీరిలో ఆరుగురు హైదరాబాద్‌లోనే ఉంటూ వికారాబాద్ అటవీ ప్రాంతంలో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. అక్కడే సమావేశాలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. వీరి కదలికలపై అనుమానం వచ్చిన ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టింది. గత వారం భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్‌లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.. అంటే ఇలాంటి వారు నగరానికి వచ్చి ఉద్యోగులు గా మారి యువతను ఉగ్రవాదం వైపు మొగ్గుచూపేలా తయారుచేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇంకా ఎంతమంది నివాసం ఉంటున్నారో అనే విషయమే పోలీసు ఉన్నతాధికారులను కలవరానికి గురిచేస్తోంది. మళ్ళీ లుంబినీపార్క్, గోకుల్ చాట్,దిల్ షుక్ నగర్ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నగరప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
హైదరాబాద్ లో పట్టుబడ్డ ఉగ్రవాదులు చెప్పిన సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులే షాక్ కు గురయ్యారు. మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన ఒక ఉగ్రవాది మహమ్మద్ సలీల్ స్ధానికంగా ఉన్న వ్యాపారవేత్త సిఫారసుతో వైద్య కళాశాలలో నాలుగేళ్ళుగా ఉద్యోగం చేస్తున్న విషయమే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. మరొకరు అబ్దుల్ రెహ్మాన్ అంతర్జాతీయ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. షేక్ జునైద్ పాతబస్తీలో డెంటిస్ట్ వైద్య సేవలు అందిస్తున్నాడు. మహమ్మద్ అబ్బాస్, హమీద్, సల్మాన్‌లు రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. సల్మాన్ అనే కూలీ పరారీలో ఉండగా అతడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు సమీపంలోని అనంతగిరి కొండల్లో గడచిన ఏడాదిన్నరగా ఉగ్రవాదులకు శిక్షణ జరుగుతున్నట్లు తెలుసుకుని పోలీసు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. పట్టుబడ్డ వారికి హిజ్బుత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఏడాదిన్నరగా ఉగ్రవాద శిక్షణ జరుగుతున్నా బయటకు తెలీకపోవటం, పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టడలేకపోవటం నిజంగా పోలీసుల వైఫల్యమనే చెప్పాలి. ఇందులో భాగంగానే తుపాకులు పేల్చటం, బాంబులు తయారుచేయటం, వాటిని పేల్చటంలో చాలాకాలంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఒకవేళ భోపాల్ నుండి పోలీసు అధికారులు రాకపోయుంటే నగరంలో ఎలాంటి విధ్వంసాలు జరిగుండేవో అంచనా వేయలేకపోతున్నారు. ఎంతమంది ప్రముఖులను, ఎన్ని షాపింగ్ మాల్స్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారనే విషయాలను తెలుసుకుంటున్నారు. దాంతో ఇటు ప్రముఖుల్లోను అటు షాపింగ్ మాల్స్ యాజమాన్యాల్లోను టెన్షన్ పెరిగిపోతోంది.
అరెస్ట్ అయిన వారు హిజ్బుత్ తహ్రీర్ సంస్థకు చెందిన వారిగా తేలింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ సంవత్సరం క్రితం భారత్‌లో వెలుగులోకి వచ్చింది. 2022 ఫిబ్రవరి నెలలో తమిళనాడులో జియవుద్దీన్ బఖావి అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు హిజ్బుత్ తహ్రీర్ సంస్థకు చెందిన వాడిగా తేలింది. ఇక, హిజ్బుత్ తహ్రీర్ సంస్థకు దాదాపు 60 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్ ప్రజలు బాంబులపై నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని నగర వాసులు భయపడుతున్నారు. ఉగ్రవాదుల అడ్డాగా హైదరాబాద్‌గా మారిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ కళ్లు మూసుకుని పాలిస్తున్నారని, ఏ సమస్యనూ పట్టించుకున్న పాపాన పోవడంలేదని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సంఘటనని సీరియస్ గా తీసుకుంది. భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో లింకులు ఉన్నందున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ త్వరలో ఈ కేసు దర్యాప్తును చేపట్టబోతుందని సమాచారం. అరెస్టయిన నిందితులకు ఉగ్రవాద సంబంధాలపై నిఘా పెట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై నోరు మెదపడంలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటనపై ఎందుకు స్పందించడంలేదని బీజేపీ ఆరోపిస్తుంది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఉగ్రవాద కార్యకలాపాలపై సమీక్ష చేయాలని, ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తోందెవరో, వారి వెనకున్న వాళ్లెవరో తేల్చాలని అన్నారు.