Murder Case: చిగురుపాటి జైరాం హత్య కేసులో రాకేష్ రెడ్డికి జీవిత ఖైదు, నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడి
Life Imprisionment for Rakesh reddy in Chigurupati Jayaram Murder Case
పారిశ్రామిక వేత్త చిగురుపాటి జైరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చింది. రాకేష్ రెడ్డికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని నిర్ధోషులుగా కోర్టు తేల్చింది. 2019 జనవరి 31వ చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యారు. రాకేశ్ రెడ్డి తన స్నేహితులతో కలిసి జయరాంను హత్య చేశారు. హత్య చేసిన అనంతరం దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో పలు దశలుగా విచారణ జరిగింది. చివరికి రాకేశ్ రెడ్డే హంతకుడని తేల్చారు.
రాకేశ్ రెడ్డి అలవాటే అతడిని పట్టించింది
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డిని అతని హాబీ దొరికిపోయేలా చేసింది. రాకేశ్ రెడ్డి తాను చేసే ప్రతిపనిని సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుంటాడు. ఈ అలవాటున్న రాకేశ్…చిగురుపాటి జయరాంతో ఖాళీ బాండ్ పేపర్లపైనా సంతకాలు తీసుకుంటున్న తతంగాన్ని కూడా వీడియో తీశాడు. దీనితో పాటు జయరాంను హత్య చేస్తున్నప్పుడు కూడా సెల్‌ఫోన్‌లో వీడియో తీసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగా రాకేశ్ రెడ్డిని పోలీసులు మరింత లోతుగా విచారించారు. నిజాలను బయటకు తీశారు. కోర్టుకు సమర్పించారు. కొన్ని రోజుల క్రితం నాంపల్లి కోర్టు రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చింది. ఈ రోజు తుది తీర్పు వెలువరించింది. జీవిత ఖైదు విధించింది.