KTR: హైదరాబాద్ అభివృద్ధికి నిధులివ్వండి. కేంద్ర మంత్రిని కోరిన కేటీఆర్
Telangana Minister KTR meets Central Minister Hardeep Singh Puri: మహానగరంగా పురోగమిస్తున్న హైదరాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని కలిసి లేఖ అందించారు. హైదరాబాద్ సమగ్ర మురుగు నీటి పారుదల మాస్టర్ ప్లాన్ కి ఆర్థిక సాయం చేయాలని, పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ కారిడార్(పీఆర్టీసీ)కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
‘‘సమగ్ర మురుగు నీటి పారుదల మాస్టర్ ప్లాన్ ప్రకారం 62 ఎస్‌టీపీ ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్లాంట్ల నిర్మాణ అంచనా వ్యయం రూ.8,684.54 కోట్లు. ఈ వ్యయంలో మూడో వంతు నిధుల(రూ.2,850 కోట్ల)ను అమృత్-2 పథకం కింద ఇస్తే మిగతా మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుంది. ప్రాజెక్టు పూర్తయితే వంద శాతం మురుగు నీటి వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు. మూసీ నది, ఇతర నీటి వనరులకు మురుగు కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉంది.
జనాభా, ఉపాధి అవకాశాలు పెరుగుతుండటంతో హైదరాబాద్ మహానగరంగా రూపుదిద్దుకుంటోంది.ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చడానికి ప్రస్తుతం హైదరాబాద్ లో 69 కిలో మీటర్ల మేర మెట్రో రైల్ నెట్‌వర్క్, 46 కిలో మీటర్ల మేర సబ్-అర్బన్ సేవలు/మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్(ఎంఎంటీఎస్) ఉన్నాయి. మెట్రో రైల్, ఎంఎంటీఎస్ లకు ఫీడర్ సేవలుగా పీఆర్టీఎస్, రోప్‌వే సిస్టమ్స్ వంటి స్మార్ట్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ ను అందించటం కోసం తెలంగాణ అన్వేషిస్తోంది. అసెంబ్లీ నుంచి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు 10 కిలో మీటర్ల పొడవున పీఆర్టీసీని ప్రతిపాదించాం.
ఈ కారిడార్ వివిధ రవాణా వ్యవస్థలతో అనుసంధానించబడింది. కారిడార్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం, డీపీఆర్ రూపకల్పనకు కన్సల్టెంట్ గా ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్(ఐపీఆర్ఆర్సీఎల్) వ్యవహరిస్తోంది. దేశంలో పీఆర్టీఎస్ ప్రమాణాలు, స్పెసిఫికేషన్ల సిఫార్సుకి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ హైపవర్ కమిటీని నియమించింది.
ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ప్రమాణాలు, నిర్దేశాలు, ఇతర అంశాలను త్వరగా అందించడానికి శాఖాపరంగా సమన్వయం చేయాలి. హైదరాబాద్ లో ఈ కారిడార్ అమలుకి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉంది’’ అని కేటీఆర్ ఆ లేఖలో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీకి వివరించారు.