TSPSC: పొరపాటును సరిదిద్దే బాధ్యత మాపై ఉంది – కేటీఆర్
KTR suspects BJP hand in Paper leak issue
తెలంగాణ పోటీ పరీక్షల పేపర్ల లీక్ విషయమై మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. ఈ మధ్య జరిగిన లీకేజీ అంశం చాలా దురదృష్టకరమని అన్నారు. పొరపాటును సరిదిద్దే బాధ్యత తమపై ఉందని కేటీఆర్ అన్నారు. లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్ తో అన్ని విషయాలు చర్చించామని కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
నిందుతుల్లో ఒకరైన రాజశేఖర్.. బీజేపీకి చెందిన వాడని తెలుస్తోందని, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్లు కేటీఆర్ వివరించారు. పేపర్ లీకేజీ విషయంలో ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే విషయం తేలాల్సి ఉందని కేటీఆర్ అన్నారు.
35 వేల ఉద్యోగాలు భర్తీ
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇప్పటి వరకు 155 నోటిఫికేషన్ల ద్వారా పోటీ పరీక్షలు నిర్వహించి 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. గత ఎనిమిదేళ్లలో దేశంలో ఎక్కువుగా ఉద్యోగాలు భర్తీ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనేనని కేటీఆర్ తెలిపారు.
మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 7 భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించామమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బోర్డ్ పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్న ఒకరిద్దరు చేసిన తప్పుల కారణంగా మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ సమీక్ష
ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టీఎస్‌పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పేపర్స్ లీక్, పరీక్షల రద్దు అంశాలపై చర్చించారు.