అక్షర రూపంలో ఉన్న ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చేవాడే నిజమైన నాయకుడు... దీనిని నిజం చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆయన తనయుడు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు.
KTR on Kaleshwaram: అక్షర రూపంలో ఉన్న ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చేవాడే నిజమైన నాయకుడు… దీనిని నిజం చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆయన తనయుడు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ 2023 లో పాల్గొని ప్రసంగించారు. ఆయన ప్రసంగం తెలంగాణలో గతంలో నీటి ఎద్దడి, నేడు నీటి వనరులు, ప్రాజెక్టులు తదితర అంశాల చుట్టూ నడిచింది. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నీటి ఎద్దడిని నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులపై ప్రసంగించారు.
నీటి ఎద్దడి కారణంగా 2014 కి ముందు ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులను సవివరంగా వివరించారు. 2014 తరువాత కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ ఏ విధంగా ముందుకు సాగిందో ఆహుతులకు వివరించారు. తెలంగాణ హరిత విప్లవం తరువాత ఆహారధాన్యాలకు కోరత నుంచి ఏ విధంగా బయటపడిందో వివరించారు. అదేవిధంగా మాంసం ఉత్పత్తులు, పాలు, ఇతర వస్తువులను ఏవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నాయో తెలియజేశారు. కాళేశ్వరం నిర్మాణం ఆవశ్యకతను కూడా ఆయన తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తవ్విన మట్టితో 101 గాజా పిరమిడ్ల ను నింపవచ్చని, ఈ ప్రాజెక్టులో వినియోగించిన ఉక్కుతో 66 ఈఫిల్ టవర్ల నిర్మాణం చేపట్టవచ్చని, కాంక్రీట్‌తో 53 బూర్జ్ ఖలీఫా టవర్ల నిర్మాణం చేపట్టవచ్చని కేటీఆర్ తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 13 జిల్లాల్లో 500 కిమీ మేర విస్తరించి ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా 20 కేంద్రాల్లో 22 పంప్‌హౌస్‌లు, 1800 కిమీ మేర కాలువలు విస్తరించి ఉన్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. 139మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులు కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఉన్నాయని కేటీఆర్ తెలియజేశారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వృద్ధిని సాధిస్తోందని తెలియజేశారు.