KTR in Davos Summit: ఎనిమిదేళ్లలో 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
KTR in Davos Summit: తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో ఆయన సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను వివరించారు. ఈ విధానాల వల్ల ఎనిమది సంవత్సరాల కాలంలో 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతను, టీఎస్ ఐపాస్ ప్రాముఖ్యతను పారిశ్రామిక వేత్తలకు వివరించారు. భారత దేశంలోనే విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచిందని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యికిపైగా ఫార్మా లైఫ్ సైన్సెస్‌కు సంబంధించిన కంపెనీలు ఉన్నాయని, తెలంగాణ నుండి 35 శాతానికి పైగా వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఫార్మాతో పాటు ఐటీ రంగంలోనూ హైదరాబాద్ అభివృద్ధికి చెందుతోందని, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో తమ సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు.