Minister Ktr: అన్నిపట్టణాల్లో మహిళా వారోత్సవాలను నిర్వహించాలి.. కేటీఆర్
Minister Ktr: మహిళలకు సమాన హక్కులు కావాలంటూ ఎంతో మంది ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించడానికి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని అన్నిపట్టణాల్లో మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
మార్చి 8న మహిళా దినోత్సవం రోజు ప్రారంభమయ్యే వారోత్సవాల్లో క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు సన్మానకార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఏడాది ఏదో ఒక థీమ్ తో మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. మహిళ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల క్యాంపులు నిర్వహించాలన్నారు. వారం పాటు జరిగే ఈ సంబరాలు వివిధ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులను, విభాగాధిపతులను, మహిళా జిల్లా కలెక్టర్లను, పోలీస్ ఉన్నతాధికారులు, మహిళా జడ్జీల వంటి వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.