జగన్ పాలనపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్, బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై లేనిపోని నింధలు వేస్తున్నారన్నారు. తాము తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అప్పులు చేసి పప్పు బెల్లంలా పంచితే తప్పు చేసినట్లు అవుతుందన్న కేటీఆర్.. వాటిని భవిష్యత్ తరాల కోసం పెట్టుబడులు పెడితే తప్పు ఎలా అవుతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేస్తే కొందరు విపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. 111 జీవో తనకోసం ఎత్తివేసినట్లు బీజేపీకి చెందిన ఓ పిచ్చోడు అన్నారని విమర్శించారు. అక్కడ ఉన్న 1.30 లక్షల ఎకరాలు నావేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. 111 జీవోను ఎత్తివేయాలని వైఎస్‌ఆర్ హయాంలోనే ప్రయత్నించారని గుర్తు చేశారు.
రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే విపక్షాలు లేనిపోనివి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. మరోవైపు కేటీఆర్ జగన్ పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనకు తెలిసిన వ్యక్తి ఏపీకి వెళ్లారని, అక్కడ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో ప్రజల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఏపీకి వెళ్లిన వ్యక్తి తనకు చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.