KTR: సీబీఐ కీలుబొమ్మ ఈడీ తోలు బొమ్మ – కేటీఆర్
KTR counter attack on PM Modi
భారత న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని, ఎమ్మెల్సీ కవిత విచారణను ధైర్యంగా ఎదుర్కొంటారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ నాయకుడు సంతోష్ విచారణను ఎదుర్కోకుండా దొంగలా దాక్కున్నాడని, తాము అలా చేయమని, ధైర్యంగా విచారణ ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
మోడీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గౌతమ్ అదానీకి మోడీ ఏ విధంగా సహకరిస్తున్నారనే విషయాన్ని కేటీఆర్ వివరించారు.
8 ఏళ్ల ప్రహసనంలో భాగంగా జూమ్లా లేదంటే హమ్లా చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. గంగుల, మల్లారెడ్డి పైకి విచారణ సంస్థలను పంపారని, తలసాని, జగదీశ్వర రెడ్డి సంబంధీకులపై ఐటీ దాడులు చేయించారని నామా నాగేశ్వర రావు, ఎంపీ రవిచంద్రపై సీబీఐ దాడులు, రాజ్యసభ సభ్యుడు పార్ధసారధి రెడ్డిపై ఐటీ దాడులు చేయడాన్ని రాజకీయ కక్ష్య సాధింపు చర్యగా కేటీఆర్ అభివర్ణించారు. రాజకీయంగా చిల్లర ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
సీబీఐ కీలుబొమ్మ ఈడీ తోలు బొమ్మ
దర్యాప్తు సంస్థల పనితీరును కేటీఆర్ ఎండగట్టారు. కేవలం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలనే టార్గెట్ చేస్తున్నారని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో అవినీతి పరులు లేరా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మలా మారితే..ఈడీ తోలుబొమ్మలా మారిందని కేటీఆర్ విమర్శించారు.