Kishan reddy: బస్తీలు అభివృద్ధి చెందితేనే, హైదరాబాద్ అభివృద్ధి చెందినట్లు- కిషన్ రెడ్డి
Kishan reddy accuses KCR government for not developing Bastis in Hyderabad
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ సర్కారు వైఫల్యాను ఎండగట్టారు. బస్తీల్లో మౌలిక వసతులు లేక జనం ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ కాదని నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉందని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే బస్తీల అభివృద్ధి అని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లేవని నిలదీశారు.
నాంపల్లి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలు ఉండే బస్తీల్లో వీధి లైట్లు, కరెంట్, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు ఉన్నాయని, మౌలిక వసతులు కల్పించక హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బస్తీలు ఇబ్బంది పడుతున్నాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు నిధుల కొరతతో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించడం లేదు.
కనీస సౌకర్యాలు అయినటువంటి రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కిషన్ రెడ్డి అన్నారు. అనేక బస్తీల్లో చాలామంది పేదలు పక్కా ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వస్తాయని ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరం చేస్తామని హామీలు ఇస్తున్నారని, బస్తీల్లో ప్రభుత్వం కనీసం వసతులు కల్పించలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.కొన్ని ఫ్లై ఓవర్లు కట్టినంత మాత్రాన, మెయిన్ రోడ్లమీద రంగులు పూసినంత మాత్రాన హైదరాబాద్ నగరం అభివృద్ధి జరిగినట్టు కాదని కిషన్ రెడ్డి అన్నారు. పేద ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సికింద్రాబాద్ పార్లమెంట్, నాంపల్లి అసెంబ్లీలో పరిధిలోని గుడిమల్కాపూర్ డివిజన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కిషన్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఉషోదయ కాలనీలో రూ. 8 లక్షలతో పార్కు అభివృద్ధికి, 15.50 వేలతో ఫుట్ పాత్ నిర్మాణానికి, భోజగుట్ట శివాజీ నగర్లో రూ. 20 లక్షలతో డ్రైన్ నిర్మాణం, రూ. 21 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.