Parliament Monsoon Session: రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు రేపు జరగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలతో చర్చ చేపట్టనున్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇరు సభల్లో ఏ విధంగా ఎండగట్టాలో పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పలు కీలక సూచనలు చేయనున్నారు.
ఇరు సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలు
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఇరు సభల్లో తన వాదనను ఏ విధంగా వినిపించాలో ఎంపీలకు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వనున్నారు కేసీఆర్. వ్యవసాయం, నీటి పారుదల రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తోంది. ఎన్నో వినూత్న విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ద్వారా వరి పండించడంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇటువంటి నేపథ్యంలో వరి పంటను కొనుగోలు చేయకుండా కేంద్రం అనేక ఆటంకాలు కలగజేస్తోంది. దీంతో మిల్లర్లు లబోదిబో మంటున్నారు. ఈ విధంగా తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నకేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టడానికి టీఆర్ఎస్ ఎంపీలను సమాయత్తం చేయనున్నారు కేసీఆర్.
కేంద్రం నుంచి అరకొర సాయం
వ్యవసాయంలో అగ్రగామిగా నిలవడంతో పాటు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ముందంజలో ఉంది. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాన్ని ప్రశంసించింది. అయినప్పటికీ ఈ అంశంలో కూడా కేంద్రం నుంచి సకాలంలో సరైన సాయం అందడం లేదు. ఈ అంశాలను ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రస్తావించనున్నారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక అనాలోచిత నిర్ణయాల వల్ల రూపాయి విలువ పతనం అవుతున్న విషయాలను కూడా ఇరు సభల్లో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఒక బాధ్యత గల దేశ పౌరునిగా దేశ ఆర్ధిక వ్యవస్థను పతనావస్థ నుంచి తేరుకునేలా చేయాల్సిన బాధ్యత తమపై ఉందనే విషయాన్ని కూడా టీఆర్ఎస్ ఎంపీలు ఉభయసభల్లో ప్రస్తావించనున్నారు.
ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీస్తున్న మోడీ సర్కార్
దేశంలో ఫెడరల్ స్పూర్తి దెబ్బతినేలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును కూడా టీఆర్ఎస్ ఎంపీలు ఎండగట్టనున్నారు. ఆ విధంగా సీఎం వారికి మార్గదర్శనం చేయనున్నారు. ఉభయ సభల్లో మిగతా విపక్ష సభ్యులతో ఏవిధంగా కలిసి ముందుకు వెళ్లాలనే విషయంలో కూడా కేసీఆర్. తమ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానున్న ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మరెన్నో కీలక విషయాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ జోరు పెంచారు. బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలకు అంతే స్థాయిలో ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఇటీవలే రెండు ప్రెస్మీట్లు పెట్టి బీజేపీ నేతలను కడిగిపారేశారు. గత ఆదివారం నాడు జరిగిన ప్రెస్ మీట్లో ఏకంగా రెండున్నర గంటల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. కాశాయ నేతలపై పదునైన విమర్శలు చేశారు. అదే వేడిని పార్లమెంటులో కూడా కలగజేయాలని తమ ఎంపీలకు నూరిపోయనున్నారు.
జాతీయ నాయకులకు సీఎం ఫోన్
పార్లమెంట్ సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానుండడంతో బీజేపీ నేతలను ఇరుకున్నపెట్టేందుకు కేసీఆర్ తనదైన వ్యూహాలతో కదులుతున్నారు. దేశంలోని పలువురు విపక్ష నేతలకు ఫోన్ చేశారు. అర్వింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ, శరద్ పవార్, తేజస్వీ యాదవ్, అఖిలేష్ యాదవ్‌లతో ఫోన్లో మాట్లాడారు. అందరం కలిసికట్టుగా కేంద్రంపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న మోడీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించాలని కోరారు.