What happened in Telangana: చిక్కుల్లో కేసీఆర్ కుటుంబం…
What happened in Telangana: తెలంగాణలో పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. గతంలో సీబీఐ హైదరాబాద్‌లో కవిత ఇంటికి వచ్చి విచారించింది. ఆ తరువాత మార్చి 11 వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో ఢిల్లీ వెళ్లి ఈడీ ఆపీసులో విచారణకు హాజరయ్యారు. మార్చి 16వ తేదీన మరోసారి రావాలని నోటీసులు జారీ చేయగా రాలేకపోతున్నట్లు ఈడీకి తెలిపారు. అదే సమయంలో ఈడీకి విచారణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేశారు. దీనిపై ఈనెల 24 విచారణ జరగనుండగా, ఈనెల 20వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ కవితకు మరోమారు నోటీసులు జారీ చేసింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిందని అనుకుంటే, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో ఒక్కసారిగా నిరుద్యోగులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు.
ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో ఇప్పటికే నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలను కూడా రద్దు చేసి మరోమారు నిర్వహింస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 పరీక్ష రాసిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం మొదలుపెట్టారు. పరీక్షా పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో ఇప్పటికే చర్చలు జరిపారు. లీకేజీ వ్యవహారంపై ఆరా తీశారు. దీనిపై కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నది. సిట్ సైతం దీనిపై విచారణ జరుపుతున్నది. ఒకే సమయంలో కేసీఆర్, కేటీఆర్, కవితలు వివిధ అంశాలపై చిక్కుల్లో పడటంతో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఈ చిక్కుల నుండి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.